హిమాలయ పర్వతాల ఆనుభూతి
హిమాలయాలు ....ఒక అద్బుత ప్రపంచం
కొన్ని విషయాలు ...అనుభవంలోకి వస్తే కానీ అర్ధం కావు. ఆ అనుభవాల తాలూకు అనుభూతులు నిరంతరం వెంటాడుతూ ఉంటె కలిగే అలౌకిక ఆనందమే వేరు.అలాంటి అద్భుతమైన అనుభూతుల సమాహారమే నా హిమాలయ యాత్ర. గత కొన్నేళ్ళుగా హిమాలయాల యాత్ర చేస్తూనే ఉన్నాను.ప్రతీ యాత్ర దేనికదే ప్రత్యేకం.వెళ్ళిన ప్రతీసారి అమ్మ ఒడిలోకి పయనించిన అనుభూతి. అసలు హిమాలయాల్లో ఏముంది? ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకానేక పర్వతాల్లాగే అవి కూడా ఒక రకమైన ప్రకృతి సహజంగా ఏర్పడిన పర్వతాలేకదా! కాకపొతే మంచుకొండలు. అలాంటివి చాలా దేశాల్లో ఉన్నాయి కదా! మరి హిమాలయాల ప్రత్యేకత ఏమిటి? ఎందుకు అంత ఆకర్షణ? ఎందుకుఅవి పదేపదే పిలుస్తుంటాయి?
వాటి గురించి విశ్లేషించే అంతటి శాస్త్రీయ పరిజ్ఞానం నాకు లేదు.కొన్ని తర్కానికీ,హేతువుకీ అందని అంశాలూ ఉన్నాయి.గ్లేసియర్లు కరిగి ప్రవహించే హిమనదాలు ఉంటాయి.ఆకాశం నుంచి నేలకు జారిపడే శ్వేత వర్ణపు జలపాతాలు,ఎలా ఏర్పడ్డాయో అంతుచిక్కని సరస్సులు కన్పిస్తాయి. మేఘాలతో దోబూచులాడే నిట్టనిలువు హిమ శిఖరాలు. సూర్య కిరణాలు తాకి ఎప్పటికప్పుడు రంగులు మారే మంచుకొండలు మెస్మరైజ్ చేస్తుంటాయి.ఎలాంటి రోగాన్నైనా నయం చేయగలిగే వనమూలికలు ఉంటాయి.స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఒకరకమైన చెట్టు వేర్లు కేజీ 50 లక్షలు విలువ చేస్తాయట.చైనా మార్కెట్ లో వాటి విలువ కోట్లకు చేరుతుంది .జరామరణాలు దరిచేరనివ్వని అపురూపమైన ప్రకృతి సంపద అక్కడ నిక్షిప్తమై ఉంది.
కాలుష్యానికి దూరంగా ,స్వచ్చమైన ఆక్సీజన్ అక్కడ దొరుకుతుంది. కొండకోనల్లో ప్రవహించే అమృత సమానమైన నీరు లభిస్తుంది.అక్కడ కొంతకాలం ఉంటే టాక్సిన్స్ తో నిండిన మన దేహం శుద్ధి చేయబడుతుంది. మెదడును ఆవరించిన కాలుష్యపు ఆలోచనల పొరలు కరిగిపోతాయి. మనం రోజూ చెప్పుకునే ఆర్గానిక్ ఆహార పదార్దాలే నిత్యం అక్కడ లభిస్తాయి.పూర్ణాయుష్కులు,దీర్ఘాయుష్కులకు అక్కడ కొదవలేదు.అన్నింటికీ మించి ధ్యానం,తపస్సు,సాధన చేసుకోవటానికి సానుకూలమైన అన్ని రకాల పరిస్థితులు అక్కడ నెలకొని ఉంటాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన అనేక గుహలు,ఏకాంత ప్రదేశాలు లెక్కకు మిక్కిలిగా ఉంటాయి.
అదేమిటో కానీ,ఒకసారి వెళ్లి వస్తే హిమాలయాలు మళ్ళీ మళ్ళీ పిలుస్తుంటాయి.ఆ పిలుపు మన మెదడుకు చేరుతూనే ఉంటుంది. ఎప్పుడెప్పుడు వెళ్దామా అని మనసు కొట్టుకుంటూనే ఉంటుంది. అక్కడి ప్రతీ అనుభవం ఒక యునీక్. చిత్రం ఏమిటీ అంటే అనుక్షణం మరణం దోబూచులాడుతూనే ఉంటుంది.అది ఎప్పటికప్పుడు మనమేమిటో గుర్తు చేస్తూనే ఉంటుంది.
Script:- Sheik sadheik Ali, THOPUDU BANDI
presents by:- sathyam patel.olapu