తోపుడుబండి .....ఆధునిక గ్రంధాలయ ఉద్యమ కెరటం
(తోపుడుబండి సాధిక్)
తోపుడుబండి చిరపరిచితం అయ్యింది.పుస్తక ప్రేమికులకు ఆత్మ బంధువు అయ్యింది. ఆధునిక గ్రంధాలయ ఉద్యమానికి కేరాఫ్
అడ్రెస్ అయ్యింది. పుస్తకానికి పట్టం కట్టాలనీ, టీవీలు,స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడి చదవటాన్ని మర్చిపోయిన వాళ్ళల్లో మళ్ళీ
చదివే అలవాటుని చేయాలని అన్ని రకాలుగా అలసట తెలియకుండా పని చేస్తూ ఎందరికో ఆదర్శం అయ్యింది.ఒక
ఆదర్శవంతమైన, సంస్కారవంతమైన ,జ్ఞానవంతమైన సమాజాన్ని స్థాపించే దిశగా కృషి చేస్తున్న తోపుడుబండి,దాని సృష్టి కర్త
,సారధి అయిన తోపుడుబండి సాదిక్ కి సంబంధించిన పూర్తీ విశేషాలను ఈ వ్యాసంలో అందిస్తున్నాం.అత్యంత ఆసక్తికరమైన
విశేషాలను మీకోసం అందిస్తున్నాం.
తోపుడుబండి నేపధ్యం
2014 డిసెంబర్ లో హైదరాబాద్ బుక్ ఫెయిర్,2015 జనవరిలో విజయవాడ బుక్ ఫెయిర్ లో ఒక మిత్రుడి స్టాల్ లో నిర్వహణ
బాధ్యతలు చూసుకున్న సాదిక్ కు ఒక విషయం స్పష్టంగా అర్ధమైంది. ప్రతీరోజు వేలాదిగా జనం తరలి రావటం ,లక్షలు విలువ చేసే
పుస్తకాలు కొనటం అతను కళ్ళారా చూశాడు.పుస్తకాల పట్ల ప్రజల్లో ఉన్న ఇష్టాన్ని,అభిమానాన్ని గమనించాడు. దానితో పాటు
మౌలికమైన సమస్య కూడా అతనికి అర్ధమయ్యింది. పుస్తకాలు అందుబాటులో ఉండటం చేత జనం కొనుక్కోగలుగుతున్నారు.
బుక్ ఫెయిర్ అయిపోయాక ,పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియని పరిస్థితి. అందుకే కొనుక్కోలేక పోతున్నారు అని
ఒక అభిప్రాయానికి వచ్చాడు.
విజయవాడ బుక్ ఫెయిర్ ముగిసాక జనవరి 12 వ తేదీన హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం లో మధ్యాహ్న భోజనం కోసం
సూర్యాపేట లోని నేషనల్ ధాబా లో ఆగారు. అక్కడే మిత్రుడితో తన మనసులోని భావాలను పంచుకున్నాడు. ప్రజల దగ్గరికే
పుస్తకాన్ని తీసుకు వెళ్లాలనుకున్నాడు. నగరంలోని సందుల్లోకి,గొండుల్లోకి పుస్తకం తీసుకు వెళ్ళాలంటే వ్యాన్లు,ఆటోల కన్నా
తోపుడుబండి అయితేనే బావుంటుంది అనుకున్నాడు. సాధారణంగా అలాంటి బండి మీద పళ్ళు,కూరగాయలు మాత్రమె
అమ్ముతారు.అలాంటిది పుస్తకాలు తీసుకొని వెళ్తే భిన్నంగా,వెరైటీగా ఉంటుంది. తొందరగా ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చు
అనుకున్నాడు.అదే విషయం మిత్రునితో చెప్పాడు. అయితే,అప్పటికే సాదిక్ వయసు యాభై ఏళ్ళు దాటిపోయింది.బండి
తోయటం శారీరక శ్రమతో కూడుకున్న పని. ఈ వయసులో శరీరం సహకరిస్తుందా? అనే ప్రశ్నను మిత్రుడు లేవనెత్తాడు. బండిని
ఫిజికల్ గా తోయటం కన్నా,ఏదైనా మోటార్ బిగించటమో, లేక ఎవరైనా మనుషులను పెట్టి తోయించటమో చేస్తే బావుంటుంది అని
ఆ మిత్రుడు అభిప్రాయ పడ్డాడు. మోటార్ బిగిస్తే అది తోపుడుబండి కాదు.మనుషులను పెట్టి తోయించినా ఆశించిన ఫలితం
రాదు. ఆర్ధికంగా, సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉండి కూడా ఒక వ్యక్తీ బండి ని తోస్తున్నాడూ అంటే ,ఖచ్చితంగా జనం దాని
గురించి ఆలోచిస్తారు అనేది సాదిక్ వాదన. ఆఖరుకు అదే ఫైనల్ అయ్యింది.
అనుకున్నదే తడవుగా హైదరాబాద్ రాగానే 15 వేలు ఖర్చు పెట్టి బండి ని తయారు చేయించటం,కవులు,రచయితలూ,పబ్లిషర్
లను కలిసి 50 శాతం డిస్కౌంట్ తో పుస్తకాలు సేకరించటం చకచకా జరిగిపోయాయి. 2015 ఫిబ్రవరి 22న హైదరాబాద్ నక్లెస్
రోడ్డు ,పీపుల్స్ ప్లాజా నుంచి తోపుడుబండి తోలియాత్ర ప్రారంభం అయ్యింది. అలా మొదలైన 'కవిత్వ చైతన్య యాత్ర' మూడు
నెలలపాటు నగరంలో 350 కిలోమీటర్లు కొనసాగింది. లాభాలను ఆశించకుండా కేవలం ప్రజలకు పుస్తకం అందాలనే ఆకాంక్షతో
వీలైనంత ఎక్కువ డిస్కౌంట్ తో పుస్తకాలను విక్రయించటం జరిగింది. ఇక్కడ సాదిక్ తోలి లక్ష్యం విజయవంతంగా
పూర్తయ్యింది.ప్రజలు,ప్రముఖులు తోపుడుబండి ని సందర్శించారు. పుస్తకాలు కొన్నారు. ప్రింట్,ఎలక్ట్రానిక్,సోషల్ మీడియా కూడా
ఈ వినూత్న ప్రయోగానికి విస్తృత ప్రచారం కల్పించారు. అయితే ,సాదిక్ ఇక్కడితో ఆగిపోలేదు. మరో లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు.
పల్లెకు ప్రేమతో.....100 రోజులు ,1000 కిలోమీటర్లు
నగరంలో కవిత్వ చైతన్య యాత్ర విజయవంతమైన తర్వాత సాదిక్ దృష్టి పల్లెల వైపుకి మళ్ళింది.అసలు పుస్తకాల అవసరం పట్నం
కన్నా పల్లెల్లోనే ఎక్కువగా ఉందని భావించి పుస్తకాన్ని పల్లెలకు తీసుకు వెళ్లాలనుకున్నాడు. దాంతో 'పల్లెకు ప్రేమతో
...తోపుడుబండి .100 రోజులు ,1000 కిలోమీటర్లు' యాత్రకు శ్రీకారం చుట్టాడు. 2016 జనవరి 24 న ఉప్పల్ లోని లిటిల్ ఫ్లవర్
జూనియర్ కాలేజి నుంచి యాత్ర అతిరధ మహారధ సాహితీవేత్తలు,పాత్రికేయుల ఆశీస్సులతో ప్రారంభం అయ్యింది. తోలి
మూడురోజులు ఉప్పల్ పరిసరాల్లో సంచరించినా ,నాలుగో రోజుకి పల్లెబాట పాటింది. సరిగ్గా అక్కడి నుంచే తోపుడుబండి
ముఖచిత్రం మారిపోయింది. అప్పటి దాకా తోపుడుబండి ని సాదిక్ నడిపిస్తే,అక్కడి నుంచి బండి సాదిక్ ను నడిపించటం
మొదలెట్టింది. పల్లెల్లోకి ప్రవేశించిన తర్వాత బండి కి కొత్త కోణం దర్శనం ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో కొనుగోలు శక్తి లేదు.
వందలు ఖర్చుపెట్టి పుస్తకాలు కొనే స్థోమత ప్రజల్లో లేదు.20-30 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చుపెట్టే పరిస్థితి లేదు. దాంతో
ఒక్కసారిగా అప్పటిదాకా ఉన్న పుస్తకాలన్నీ తీసేసి ,ప్రజల బడ్జెట్ కు అనుకూలమైన తక్కువ ఖరీదైన పుస్తకాలను బండి మీద
పెట్టాల్సి వచ్చింది. అది సత్ఫలితాన్ని ఇచ్చింది.హైదరాబాద్,రంగారెడ్డి,నల్గొండ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో బండి తిరిగింది.జాతీయ
రహదారి వదిలి పెట్టి లోపలి వెళ్తున్న కొద్దీ ప్రజల పరిస్థితి అర్ధమవుతూ వచ్చింది.5,10 రూపాయలు కూడా పెట్టి కొనలేని
పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు.ఏ ఊళ్లోకి వెళ్ళినా ముందుగా పిల్లలు,విద్యార్ధులు బండిని చుట్టుముట్టటం,ఆశగా పుస్తకాలను
చూడటం,కొనలేక పోవటం సాదిక్ గమనించాడు. కొందరు పిల్లలు పుస్తకాన్ని తీసుకొని ,అందులోని అంశాలను నోట్ చేసుకొని
తిరిగి ఇవ్వటం,కొందరు పుస్తకాలను దొంగిలించటం అన్నీ చూశాడు. దాంతో పిల్లలకు ఆ దుస్థితి రాకూడదనుకున్నాడు.
ఉచితంగానే పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అక్కడి నుంచి నల్గొండ,మెదక్,వరంగల్ జిల్లాల్లో జరిగిన యాత్రలో
ఉచితంగానే పుస్తకాలు పంపిణీ చేయటం జరిగింది. ఈ వంద రోజుల యాత్రలో ఎక్కడా హైవే ఎక్కకుండా పూర్తిగా గ్రామీణ
ప్రాంతాల్లోనే బండి తిరిగింది. వందలాది గ్రామాలు,వందలాది ప్రభుత్వ స్కూళ్ళు,వేలాది మంది పేద,నిరుపేద విద్యార్ధులను కలవటం
జరిగింది.104 రోజుల యాత్ర తర్వాత ,మే 8వ తేదీన హన్మకొండ లోని పబ్లిక్ గార్డెన్ లో తోపుడుబండి పల్లెకు ప్రేమతో యాత్ర
జరిగింది. ఆ సందర్భంగా ఒక బహిరంగ సభ కూడా జరిగింది.
అయితే, ఈ యాత్రలో ఎదురైనా అనుభవాలు,గ్రామీణ ప్రజల అభ్యర్ధనలతో తోపుడుబండి మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం
చుట్టింది. అదే 'ఊరూరా గ్రంధాలయం'.ప్రతీ ఊళ్లోనూ గ్రంధాలయం ఏర్పాటు చేయటం,ప్రజలకు పుస్తకాలు అందుబాటులో ఉంచటం
ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
ఊరూరా గ్రంధాలయం
ఈ కార్యక్రమం క్రింద తోపుడుబండి గ్రామీణ ప్రాంతాల్లో గ్రంధాలయాలు ఏర్పాటు చేస్తోంది. ఆయా గ్రామాల ప్రజలను,ప్రజా
ప్రతినిధులను,యువజన సంఘాలను భాగ స్వాములను చేస్తూ,గ్రంధాలయాలను ఏర్పాటు చేస్తూ వస్తుంది. వీలును బట్టి ఒక్కో
గ్రంధాలయానికి ఒక బీరువా,రెండు బల్లలు,ఎనిమిది కుర్చీలు,వెయ్యి పుస్తకాలు సమకూరుస్తూ వస్తుంది. ఇప్పటి వరకూ అత్యధిక
శాతం స్వంత నిధులు,కొందరు సహృదయుల ఆర్ధిక సాయంతో చేస్తూ వచ్చింది. ఇటీవల వనరుల లేమితో కేవలం వెయ్యి
పుస్తకాలను మాత్రమె ఇస్తూ,బల్లలూ,కుర్చీలు,బీరువాలను స్తానికులనే సమకూర్చుకోమని చెప్తోంది. లేదా ఎవరైనా దాతలు
ముందుకు వస్తే ,వాటిని కూడా తోపుడుబండే సమకూరుస్తుంది. ఈ కార్యక్రంతో పాటే,సమాంతరంగా మరో కార్యక్రమాన్ని కూడా
తోపుడుబండి చేపట్టింది.
బడిబడికి తోపుడుబండి ...
నేటి బాలలే రేపటి పౌరులు , ఒక ఆరోగ్యకరమైన,సంస్కారవంతమైన సమాజం ఏర్పడాలంటే ,దానికి బాల్యం నుంచే బీజాలు
వేయాలని తోపుడుబండి మనస్పూర్తిగా నమ్ముతుంది. కేవలం స్కూల్ పుస్తకాలే కాకుండా,జీవిత విలువలు నేర్పించే,ఒక మంచి
వ్యక్తిత్వాన్ని అందించే,సమాజం పట్ల అవగాహన కల్పించే పుస్తకాలను కూడా విద్యార్ధులు చదవాలని ,అది వారి భవిష్యత్తుకు
బంగారు బాట వేస్తుందని విశ్వసిస్తోంది. అందుకే ప్రతీ ప్రభుత్వ బడిలో గ్రంధాలయం ఏర్పాటు చేయాలని తోపుడుబండి
సంకల్పించింది. దాని ఫలితమే బడిబడికి తోపుడుబండి అనే పధకం. దానికింద పలు స్కూళ్ళలో వెయ్యి పుస్తకాలతో గ్రంధాలయం
ఏర్పాటు చేస్తూ వస్తోంది.
పై రెండు పధకాల ద్వారా ఇప్పటికి తోపుడుబండి 134 గ్రంధాలయాలను ఏర్పాటు చేసింది. అది కొనసాగుతూనే ఉంది. ఈ
గ్రంధాలయాల ఉద్యమం ద్వారా వందల వేల గ్రందాలయాలను ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ప్రజలను చైతన్య
వంతులను చేస్తోంది. తోపుడుబండి ప్రయత్నాలు ఫలించి ప్రజల్లో చైతన్యం రావటం సంతోషింప జేస్తోంది.
బస్తీలో పుస్తకాల పండుగ
నగరాలు,పల్లెలే కాకుండా పట్నాల్లోని మురికి వాడల్లో నివసించే పిల్లలకు,పెద్దలకు కూడా ఉచితంగా పుస్తకాలు అందించాలనే
సంకల్పంతో ఇటీవల వేసవి కాలపు సెలవుల్లో తోపుడుబండి 'బస్తీలో పుస్తకాల పండుగ' కార్యక్రమాన్ని చేపట్టింది.మండే ఎండలను
లెక్క చేయకుండా వరంగల్ నగరంలోని 26 మురికి వాడల్లో తోపుడుబండి తిరిగింది.వేలాదిమంది పిల్లలకు ,పెద్దలకు ఉచితంగా
పుస్తకాలను అందజేసింది.రాబోయే దసరా సెలవుల్లోనూ మరికొన్ని మురికి వాడల పిల్లలకు పుస్తకాలను
అందించేందుకుప్రణాళికలు రూపొందించింది.అలాగే, ఈ నవంబర్ లో గిరిజన ప్రాంతాల్లో పిల్లలకు పుస్తకాలు,గ్రంధాలయాలు
ఏర్పాటు చేసేందుకు గాను 'అడవి తల్లికి అక్షర తోరణం' పేరిట ఒక బృహత్తర కార్యక్రమాన్ని రూపొందిస్తోంది.
తోపుడుబండి సాదిక్ జీవిత విశేషాలు
గత మూడేళ్ళుగా అక్షర యజ్ఞం సాగిస్తున్న షేక్ సాదిక్ అలీ తోపుడుబండి నే తన ఇంటిపేరుగా మార్చుకొని 'తోపుడుబండి సాదిక్'
అయ్యాడు. వాళ్ళ నాన్న మహబూబ్ అలీ వరంగల్ జిల్లా వర్ధన్న పేట వాసి. అమ్మ బద్రున్నిసా బేగం ఖమ్మం జిల్లా కల్లూరు వాసి.
1964 జూలై 3 వ తేదీన పుట్టిన సాదిక్ తండ్రి ఉద్యోగ రీత్యా ప్రాధమిక విద్యతో పాటు డిగ్రీ వరకు ఖమ్మం లోనే చదువుకున్నాడు.ఆ
తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఏం.ఏ. తెలుగు సాహిత్యం చదివాడు.ఆ తర్వాత ఉదయం దిన పత్రికలో సబ్
-ఎడిటర్ గా చేరి పదిహేనేళ్ళ పాటు ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాలో సీనియర్ జర్నలిస్టుగా కొనసాగాడు. చదువుకునే రోజుల్లో పలు
విద్యార్ధి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నాడు. అనంతర కాలంలో వ్యాపార రంగంలో ప్రవేశించి విజయవంతమైన వ్యాపార వేత్తగా
పేరు గడించాడు. 50 ఏళ్ళు నిండిన తర్వాత వ్యాపార బాధ్యతను తన సహచరులకు అప్పగించి ప్రస్తుతం పూర్తికాలం సమాజ
సేవలో కొనసాగుతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు ఉష ను ప్రేమించి వర్ణాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఉన్నత
విద్యావంతురాలైన ఉష ప్రస్తుతం ప్రభుత్వ వ్యవసాయ శాఖలో వరంగల్ జిల్లా జాయింట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.